అల్లాదుర్గం(మెదక్): నేషనల్ హైవేపై రోడ్డు కుంగిపోవడంతో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడి బాలిక మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 161పై బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమాకాంత్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవ్యస్వామి (8), ఉమాకాంత్ అన్న కుమారుడు వైభవ్‌తో కలసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని డెగూళూరుకు వెళ్లేందుకు కారులో బయల్దేరారు. సరిగ్గా రాంపూర్ గ్రామ శివారులోకి వచ్చేసరికి ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికీ తీవ్రగాయాలవ్వగా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ప్రవ్యస్వామి మృతి చెందింది. వైభవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు


