నిషేఽధిత జాబితాలో ఉన్న భూముల్లో ఇళ్ల నిర్మాణాలు ప్లాట్లుగా ఉన్న భూములకు పట్టాలు రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం
పటాన్‌చెరు నియోజకవర్గంలో రెవెన్యూ అక్రమాలు రెక్కలు విప్పాయి లంచాలకు అలవాటు పడిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో కంచే చేను మేసిన చందంగా తయారైంది. రామచంద్రాపురం, గుమ్మడిదల, జిన్నారం మండలాల పరిధిలో విలువైన ప్రభుత్వ, అటవీ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
పటాన్‌చెరు: నిషేధం జాబితాలో ఉన్న భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా అటు పాలకులుగానీ, ఇటు అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఎక్కడో ఉన్న హైడ్రాను ఆశ్రయిస్తున్నారే తప్ప, పక్కనే ఉన్న రెవెన్యూ గడప తొక్కడం లేదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాట్లుగా ఉన్న భూములకు పట్టాలను సృష్టిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుని కోట్లాది రూపాయల లంచాలను తీసుకుని పట్టాలిచ్చేస్తున్నారు. తప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు పంపి రికార్డులను మార్చి అసైన్డ్ భూములకు సైతం పట్టాలిచ్చేస్తున్నారు. పటాన్‌చెరు మండల పరిధిలో పాటి, రుద్రారం, ముత్తంగి గ్రామాల పరిధిలో అక్రమ పద్ధతిలో పట్టాపాసు పుస్తకాలు సృష్టించారు. కొన్నేళ్లుగా ప్లాట్లు అని చెప్పుకుంటున్న వారికి అవి ప్లాట్లు కావు, సాగు భూములని రెవెన్యూ అధికారులు రికార్డులు తయారు చేశారు. ముత్తంగిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ చేసేశారు. ముఖ్యమంత్రికి బాగా దగ్గరని చెప్పుకునే ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా పేరున్న ఓ వ్యక్తి పేరిట అసైన్డ్ భూమికి పట్టాలు రావడంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు. అమీన్‌పూర్‌లో వివాదాస్పద 343 సర్వే నంబర్ భూమిలో ఫెన్సింగ్ వేసి ఓ అసైన్డ్ పట్టాదారు భూమి చదును పనులు చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు.
ప్రతీ పనికి ఓ రేటు
రెవెన్యూ కార్యాలయంలో ప్రతీ పనికి ఓ రేటు ఉంది. ఆ పద్ధతిలో కాకుండా నేరుగా వెళితే మాత్రం ఆ ఫైలు కదలడం లేదు. ఇటీవల ఓ పట్టాదారు ఓ ఎంపీతో ఫోన్ చేయించుకున్నా ఫైలు కదల్లేదు. దీంతో ఆ భూ యజమాని తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమవుతున్నారు. ఫౌతి మార్పిడి, ఇతర రికార్డుల సవరణకు మీ సేవలో దరఖాస్తు చేసినా మధ్యవర్తిత్వం చేయకపోతే రికార్డు సవరించడం లేదు. జిల్లా యంత్రాంగం ఇటుగా దృష్టి సారిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు చెప్తున్నారు.
అటవీ భూముల అన్యాక్రాంతం


