వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె
ఉత్తమ ప్రదర్శనకు రూ.10 వేలు ప్రారంభించనున్న కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: జిల్లా స్థాయి శాసీ్త్రయ వైజ్ఞానిక ప్రదర్శనకు వేళైంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక వైజ్ఞానిక సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి యేటా సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 4,5వ తేదీల్లో నిర్వహిహించే ప్రదర్శనలకు మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాల వేదిక కానుంది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలు వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణం, గణితం, వైజ్ఞానిక అంశాలపై రూపొందించిన ఎగ్జిబిట్‌లను ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించనున్నారు.
రెండు రోజులు మాత్రమే..
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించాల్సిన వైజ్ఞానిక ప్రదర్శనను 4, 5తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు మాత్రమే హాజరు కావాలి. ఇందులో పాల్గొనే 6,7, 8వ తరగతుల విద్యార్థులను జూనియర్లు, 9,10 తరగతులను సీనియర్లుగా పరిగణిస్తారు.
గత ఏడాది 54 మంది ఎంపిక
గత ఏడాది నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 54 మంది ఇన్‌స్పైర్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. వారు మరింత మెరుగైన ఎగ్జిబిట్‌లు రూపొందించేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. వాటితో మరింత మెరుగైన ఎగ్జిబిట్‌లు రూపొందించి త్వరలో జరగనున్న ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంది.
4, 5వ తేదీల్లో జిల్లా స్థాయి నైపుణ్య ప్రదర్శన
గురువారం ప్రారంభం
ఈనెల 4న కలెక్టర్ చేతుల మీదుగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించనున్నారు. అయితే ఒక ప్రాజెక్టుకు ఒక విద్యార్థి మాత్రమే హాజరు కావాలి. గురువారం ఉదయం 8 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 5 తేదీన సాయంత్రం 4 గంటల నుంచి విజేతలకు బహుమతులు అందజేస్తారు. వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన వారు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారు.


