ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Dec 2 2025 9:44 AM | Updated on Dec 2 2025 9:44 AM

ఎన్ని

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

కేసు నమోదు

కొండపాక(గజ్వేల్‌): ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి గుడి ఆవరణలో సమావేశం నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ వివరాల ప్రకారం... కొండపాకలోని రామాలయం గుడి ఆవరణలో సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు అనంతుల ప్రశాంత్‌, నూనె కుమార్‌, బొద్దుల తిరుపతి,అంబటి బాల్‌చందర్‌గౌడ్‌, దొమ్మాట మహిపాల్‌రెడ్డిలతో పాటు మరి కొందరు కలిసి త్వరలో జరిగే ఎన్నికల విషయంలో నామినేషన్లు వేయడానికి సమావేశమయ్యారు. కోడ్‌ను ఉల్లంఘిస్తూ సమావేశం ఏర్పాటు చేసిన దృష్ట్యా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎఫ్‌ఎస్‌టీ టీం వెళ్లి గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వాహన తనిఖీల్లో

రూ.5 లక్షలు స్వాధీనం

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మండలంలోని కాళ్లకల్‌ శివారులో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీల్లో మండలంలోని కూచారం గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌ తన బైక్‌పై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.5 లక్షల నగదును పంచనామా నిర్వహించి పోలీసులు సీజ్‌ చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న నగదును ఆర్డీఓకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తూప్రాన్‌ సీఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎవరైనా అక్రమంగా నగదును తరలిస్తే వారిపైఎన్నికల ఉల్లంఘన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికలయ్యే వరకు తనిఖీలను నిత్యం కొనసాగిస్తామన్నారు.

ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు !

రాయికోడ్‌(అందోల్‌): మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలుండగా ప్రజల్లో మంచి పేరున్న కనీసం 3,4 పంచాయతీల్లోని అభ్యర్థులను ఏకగ్రీవం చేయాలనే పట్టుదలలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఒకరికి జైలు

కొమురవెల్లి(సిద్దిపేట): డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో సిద్దిపేట మెజిస్ట్రేట్‌ ఒకరికి జైలు శిక్ష విధించినట్లు సోమవారం ఎస్‌ఐ మహేశ్‌ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన కొండపాకకు చెందిన ప్రేమ్‌దాస్‌ను కోర్టులో హాజరుపరుచగా మెజిస్ట్రేట్‌ అతనికి మూడు రోజుల జైలు శిక్ష విధించాడు.

15 మందికి జరిమానా

సంగారెడ్డి క్రైమ్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డి పల్లి చౌరస్తా , బైపాస్‌లోని గుర్రపు బొమ్మ, పాత బస్టాండ్‌, స్థానిక ఐబీ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షకీల్‌ అహ్మద్‌ సిద్దిఖీ ఐదుగురురికి రూ.1500, పది మందికి రూ. వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

ఉచిత చేప పిల్లలు పంపిణీ

వెల్దుర్తి(తూప్రాన్‌): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే మండల కేంద్రంలోని వెల్దుర్తి దేవతల చెరువు, కుడి చెరువులకు ప్రభుత్వం సుమారు 5.40 లక్షలు చేప పిల్లలు అందజేయగా వాటిని స్థానిక మత్స్య సహకార సంఘం సభ్యులు ఆయా చెరువుల్లో వదిలారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎఫ్‌ఓ సంతోష్‌కుమార్‌, ఫీ ల్డ్‌ అసిస్టెంట్‌ బాలాజీ, ఫీల్డ్‌మెన్‌ శేఖర్‌, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బాలరాజ్‌, శ్రీనివాస్‌, అశోక్‌, ఏఈఓ మజీద్‌ పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన1
1/1

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement