సజావుగా నామినేషన్ ప్రక్రియ
అదనపు కలెక్టర్ నగేశ్
నిజాంపేట(మెదక్): నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలాంటి పొరపాట్లు జరగకుండా, నామినేషన్ కార్యాలయం వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్‌లను రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని తెలిపారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంట అధికారులు ఉన్నారు. అలాగే నామినేషన్ ప్రక్రియను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. డీఎస్పీ వెంట ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎంపీడీఒ రాజిరెడ్డి, సీఐ వెంకటరాజాగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ రాజేశ్ పాల్గొన్నారు.


