ఉపాధ్యాయులతోనే దేశ భవిష్యత్
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
జిన్నారం (పటాన్‌చెరు): ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రయోజనాలను వెంటనే అందించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం పట్టణం మాదారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ ఉద్యోగ విరమణ అభినందన సభకు ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, పోలీసులు, లాయర్లను తయారు చేసేది ఉపాధ్యాయులేనన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, దేశ భవిష్యత్తుకు వారే పునాదులు నిర్మిస్తారన్నారు. ఉద్యోగరీత్యా సేవలందించిన ఉద్యోగులకు ప్రభుత్వం విరమణ ప్రయోజనాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి ఎంఈఓ కుమారస్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.


