దత్తాచల క్షేత్రాభివృద్ధికి కృషి
మాజీ గవర్నర్ దత్తాత్రేయ
హత్నూర(సంగారెడ్డి): దత్తాచల క్షేత్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హత్నూర మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో దత్త జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాచల క్షేత్రాభివృద్ధి కోసం తనవంతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రపతి సభాపతి శర్మ దత్తాత్రేయను స్వామివారి ప్రసాదం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీధర్‌యాదవ్, రఘువీరారెడ్డి, నాగప్రభుగౌడ్, డాక్టర్ రాజుగౌడ్, రాజేందర్, సతీశ్‌తోపాటు పలువురున్నారు.
పీఆర్సీ అమలు చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ వెంటనే అమలు చేయడంతోపాటు అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని ఉపాధ్యాయభవన్‌లో ఆదివారం టీపీటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ...2023 జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ రెండేళ్లు దాటినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. పెరుగుతున్న మార్కెట్ ధరలకనుగుణంగా ఐదేళ్లకొకసారి అమలు చేయాల్సిన వేతన సవరణ గడువు ముగిసి చాలా రోజులైందని, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంపుతోపాటు ప్రతీనెల చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్,రాష్ట్ర కౌన్సిలర్ సంజీవయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నాజర్ పటేల్, మల్లికార్జున్ జిల్లా కార్యదర్శులు మేకల శ్రీనివాస్, జగన్నాథం, బాణోత్ రవీందర్, శ్రీశైలం పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా జరగాలి
సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్
వట్‌పల్లి(అందోల్): ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అందోల్ అక్సాన్‌పల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంతోపాటు, వట్‌పల్లి మండలంలోని గ్రామ పంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా, సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జోగిపేట సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐలు పాండు, లవకుమార్ పాల్గొన్నారు.
కార్మిక సమస్యలపై
నిరంతర పోరాటం
సదాశివపేట(సంగారెడ్డి): కార్మికవర్గ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెదక్ పట్టణంలో డిసెంబర్ 7,8,9 తేదీల్లో మూడురోజులపాటు జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దత్తాచల క్షేత్రాభివృద్ధికి కృషి


