కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
నారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): జిల్లా సాగుకోసం బీఆర్‌ఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించని పక్షంలో త్వరలో పాదయాత్రతోపాటు ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఖేడ్ మండలం అనంతసాగర్‌లో ఆదివారం మల్లన్నస్వామి, సిర్గాపూర్‌లో బీరప్పస్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఖేడ్ మండలం మాద్వార్‌కు చెందిన తాజా మాజీ సర్పంచ్ స్వరూప రాములు బీజేపీలోంచి, తుర్కాపల్లికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ అనుచరులతో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలోని పలు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలని ఆయా ఎత్తిపోతల పనులను బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపివేసిందన్నారు. జిల్లాపై ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ప్రస్తుతం పంచాయతీల ట్రాక్టర్లు మూలనపడి, గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ చేతల ప్రభుత్వం కాగా, కాంగ్రెస్ చెత్త ప్రభుత్వమని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో 1.30 కోట్లమంది మహిళలకు చీరలను పంపిణీ చేయగా ప్రస్తుతం డ్వాక్రా సంఘాల సభ్యులకే అదీ ఏకరూపదుస్తుల్లా పంపిణీ చేస్తున్నారన్నారు. మహలక్ష్మి కింద ఒక్కోమహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 8 చెరువులను మంజూరుచేసి భూసేకరణ, తండాలకు రోడ్ల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసినా పనులు చేపట్టడంలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యాదవులకు అన్ని విధాలుగా గౌరవం లభించిందన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతో గొర్రెల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, రాష్ట్రనాయకులు మోహిద్‌ఖాన్, పరమేశ్వర్, సంగప్ప, అభిషేక్ షెట్కార్, నగేష్, గీతారెడ్డి పాల్గొన్నారు.
బసవేశ్వర, సంగమేశ్వరచేపట్టకుంటే ఉద్యమమే
త్వరలో పాదయాత్ర
మాజీమంత్రి హరీశ్‌రావు


