వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. వసురాం తండాలో తల్లీకూతురు, సంగారెడ్డి పట్టణంలోని రాజపేటకు చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది.
నర్సాపూర్ రూరల్: ఓ తల్లీ కూతురుతో అదృశ్యమైంది. ఈ సంఘటన నర్సాపూర్ మండలం తుజాల్ పూర్ పంచాయతీ పరిధిలోని వసురాం తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం.. వసురాం తండాకు చెందిన ఆటో డ్రైవర్ దేవవత్ రాములుకు భార్య కావేరి, కూతురు భావన ఉన్నారు. శుక్రవారం ఉదయం కావేరికి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పగా రాము ఆటోలో నర్సాపూర్‌కు తీసుకువచ్చి ఆస్పత్రిలో వైద్యం చేయించాడు. అతడికి ఆటో గిరాకీ రావడంతో హైదరాబాద్‌కు వెళ్తున్నానని, భార్య, కూతురును ఇతరుల ఆటోలో ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో రాము ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులకి ఫోన్ చేయగా ఇంకా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో నర్సాపూర్‌తో పాటు బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. శనివారం నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజంపేటలో వివాహిత..
సంగారెడ్డి క్రైమ్: ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాము నాయుడు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాజంపేట్‌కు చెందిన దానరాం వీరప్రతాప్, భార్య రేణుక(32) దంపతులు. వీరికి పిల్లలు ఉన్నారు. ఇద్దరు వృత్తి రీత్యా ప్రైవేటు జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు పెరిగిపోవడంతో కుటుంబసభ్యులు పలుమార్లు ఇరువురిని మందలించారు. కోపంతో గత నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రేణుక తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిస్తే 87126 61830 నంబర్లకు తెలియజేయాలని సీఐ సూచించారు.
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం


