సత్వర న్యాయం చేస్తాం
మెదక్ మున్సిపాలిటీ: ఎలాంటి కేసులైన వేగంగా ఛేదించి బాధితులకు న్యాయం చేయడమే మా డ్యూటీ అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో ఇటీవల ఓ పెళ్లింట్లో 10 తులాల బంగారం చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికతను ఉపయోగించి రెండురోజుల్లో కేసు చేధించారు. చోరీకి పాల్పడిన నిందితురాలిని అరెస్ట్ చేసి బంగారాన్ని కోర్టు ద్వారా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాఽధిత కుటుంబీకులు శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీని సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను గుర్తించడం అభినందనీయమన్నారు. రెండు రోజుల్లో కేసు ఛేదించిన ఇన్‌స్పెక్టర్ మహేశ్‌ను ఎస్పీ అభినందించారు.
మహిళల భద్రతకే షీ టీమ్స్..
మెదక్ మున్సిపాలిటీ: మహిళలు, బాలికల భద్రత కోసమే షీటీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్‌లో జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివరాలను ఆయన శనివారం వివరించారు. మెదక్, తూప్రాన్ రెండు డివిజన్లలో షీటీమ్స్ ముమ్మరంగా పర్యటించాయని చెప్పారు. మెదక్ డివిజన్ పరిధిలో 5 ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఈ – పిటి కేసులు, తూప్రాన్‌లో 3 ఎఫ్‌ఐఆర్‌లు, 7 ఈ –పిటి కేసులు నమోదు చేశారన్నారు. మొత్తం 84 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ చేశామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో నెలరోజుల్లో 55 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. బాలికలు, మహిళలు సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 57963, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


