దత్తత.. ఉత్తదే..!
అభివృద్ధి పనులకు నోచుకోని గ్రామాలు ఇప్పటికీ సమస్యలతో సతమతం బీబీపాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి దత్తత గ్రామాల దుస్థితి
కాగితాలకే పరిమితమైన హామీలు
సమస్యలతో ఈదుతున్న ఈదులపల్లి
పటాన్‌చెరు: లక్డారం గ్రామాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకున్న సమయంలో అధికారుల, పార్టీ కార్యకర్తల హడావిడి అంతాఇంతా కాదు. గ్రామంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అప్పట్లో అధికారులు రూ.10కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఇప్పటి వరకు ఒక్క పని నోచుకోలేదు. గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బండ రాళ్ల పగుల గొట్టేందుకు పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారని, వాటి ధాటికి తమ ఇళ్లు కూలుతున్నాయని శబ్ధ, వాయు కాలుష్య సమస్యలతో బాధ పడుతున్నామని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన ఎంపీ.. తర్వాత ఒక్కసారి కూడా అటువైపు మళ్లిచూడలేదు. రోడ్లు, వీధి దీపాల కోసం చేసిన ప్రతిపాదనలూ పడేశాయి. లక్డారం గేటు వరకు డివైడర్‌తో రోడ్డు వేస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణ జరిగినా డివైడర్ వేసేంత విశాలంగా ఆ రోడ్డు నేటికీ రూపాంతరం చెందలేదు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి రచించిన ప్రణాళికలను ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి కాలేదు. గ్రామ పంచాయతీ నిధులు, ఇతర మైనింగ్ సంస్థల ఇచ్చిన విరాళాలతో గ్రామంలో ఆ తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి కానీ, ఎంపీగా అప్పట్లో పని చేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన హామీలు ఏవీ అమలు కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం, ఇంటింటికి సోలార్ లాంతర్లు ఇప్పిస్తామన్న హామీ నేటికీ అమలు కాలేదు.
కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ‘గ్రామజ్యోతి’పథకంలో భాగంగా ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పించాలి. గ్రామ రూపురేఖలు మార్చాలన్నది ఈ పథకం ఉద్దేశం. అప్పటి ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డిలు కూడా తమ వంతు గ్రామాలను దత్తత తీసుకున్నారు. బీబీ పాటిల్ ఝరాసంగం మండలం ఈదులపల్లిని, కొత్త ప్రభాకర్‌రెడ్డి పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామాలను దత్తత తీసుకున్నారు. దీంతో ఆయా గ్రామ ప్రజలు తెగ సంబరపడి పోయారు. ఇక తమ గ్రామాల రూపు రేఖలు పూర్తిగా మారుతాయని కలలుగన్నారు. సీన్‌కట్ చేస్తే.. ఆ రెండు గ్రామాల్లో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రెండింతలు సమస్యలు తాండవిస్తున్నాయి. జిల్లాలోని ఆ రెండు దత్తత గ్రామాలపై సాక్షి కథనం.
ఏమీ చేయలేదు
అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గ్రామాన్నీ దతత్త తీసుకొని ఎలాంటి అభివృద్ది చేయలేదు. నేటికీ అవే సమస్యలతో సతమతమవుతున్నాం. క్రషర్ల కారణంగా పౌరుల జీవనం అధ్వానంగా మారింది. పగటి పూట వేలాది కంకర లారీల రాకపోకలతో దుమ్ముతూ గ్రామంతా మునిగిపోతుంది. రాత్రి పూట పేలుళ్లతో ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఆ సమస్యలతో జీవించడం అలవాటుగా మారింది. ఏ నాయకుడు మా గ్రామానికి చేసిందేమీ లేదు. – భరత్, లక్డారం
ఝరాసంగం(జహీరాబాద్): అప్పటి బీఆర్‌ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మండల పరిధిలోని ఈదులపల్లిని దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే ప్రణాళికలను జిల్లా ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించి సిద్ధం చేశారు. అదే ఏడాది వేసవికాలంలో గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో గ్రామంలో నెలకొన్న తాగునీటి కొరతను తీరుస్తారని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అదే విధంగా గ్రామంలో ప్రధానంగా రహదారి మధ్యలో చిన్నపాటి వంతెన అవసరం ఉంది. దీని నిర్మాణం సైతం చేపట్టకపోవడంతో మురుగు రహదారిపైనే ప్రవహిస్తుంది. దీంతోపాటు మురికి కాల్వలు, సీసీ రహదారులతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాటిని కాగితాలకే పరిమితమయ్యాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
దత్తత.. ఉత్తదే..!
దత్తత.. ఉత్తదే..!


