రెండో విడతకు సన్నద్ధం
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 55 కేంద్రాలు ఏర్పాటు 10 మండలాలలో ఎన్నికల నిర్వహణ
సంగారెడ్డి జోన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నుంచి రెండో విడత ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగానే కేటాయించిన క్లస్టర్ల వారిగా నోటిఫికేషన్ విడుదల చేసి ఓటరు జాబితాను విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. మూడు రోజులపాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 10 మండలాల పరిధిలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 243 గ్రామపంచాయతీలు, 2,146 వార్డు స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ రూపొందించారు. అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఆయా మండలాల్లో 55 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారిగా కేటాయించిన ఆయా గ్రామాలలోని మండల పరిషత్ రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గుర్తించారు. కాగా, నామినేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు స్టేజ్–1 అధికారులకు అవసరమయ్యే మెటీరియల్ సరఫరా చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు స్టేషనరీ, బ్యానర్లు తదితర సామగ్రిని నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించేందుకు హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేశారు.


