సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
ఎన్నికల పరిశీలకులు కార్తీక్ రెడ్డి, రాకేష్
సంగారెడ్డి జోన్: గ్రామపంచాయతీ ఎన్నికలలో తమకు కేటాయించిన విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు కార్తీక్ రెడ్డి, రాకేష్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నోడల్ అధికారులతో కలిసి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జానకి రెడ్డి పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
పెంచుకోండి
నారాయణఖేడ్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని అన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు తగ్గుతాయన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని తల్లిదండ్రులకూ చెప్పాలన్నారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాగా చదువుతూ తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాలని సూచించారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, సీనియర్ న్యాయవాది మారుతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మహేష్ కుమార్ పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
జహీరాబాద్: రెండో విడతకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. శనివారం మండలంలోని హోతి(బి) కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల కౌంటర్లను చూశారు. అభ్యర్థులకు కేంద్రాల వద్ద తగిన వసతులు ఉన్నదీ లేనిదీ ఆరా తీశారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి


