చెరువులో పడి చావు..!
● కూతురుతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన పోలీసులు
తూప్రాన్: కుటుంబ తగదాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి, కూతురును పోలీసులు రక్షించారు. ఈ సంఘటన తూప్రాన్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన రాణి, శివశంకర్ దంపతులు. వీరికి కూతురు ఉంది. శివశంకర్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య, కూతురును దుర్భాషలాడుతున్నాడు. ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా తాగుడుకే పెడుతున్నాడు. ఓ శుభ కార్యానికి వెళ్లి వచ్చిన రాణికి ఇంటికి తాళం వేసి ఉంది. భర్తకు ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్లు తిడుతూ చెరువులో పడి చావుమని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన రాణి, కూతురుతో కలసి ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది. పట్టణ సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు 100 నంబర్‌కు డయల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రవి, శ్రీకాంత్ చెరువు కట్ట వద్దకు వెళ్లి తల్లి, కూతురుకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. భర్తను కౌన్సెలింగ్ ఇచ్చారు.


