సాంకేతిక పరిజ్ఞానం అవసరం
తూప్రాన్: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పరిశీలకుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం కంప్యూటర్ విద్యను పర్యవేక్షించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని, ఉపాధ్యాయుల బోధన తీరును ప్రశంసించారు. సమావేశంలో ఎంఈఓ సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చేగుంట(తూప్రాన్): రాష్ట్రస్థాయిలో సత్తా చాటి జిల్లా పేరును నిలపాలని విద్యాశాఖ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనం అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా డోర్నకల్‌లో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొనే అండర్–17 క్రీడాకారులకు చేగుంట ఉన్నత పాఠశాలలో క్రీడా కిట్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు డీకాన్ ప్లానర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు క్రీడాకారులకు కిట్లను సమకూర్చినట్లు తెలిపారు.
తనువు చాలించిన భర్త
కౌడిపల్లి(నర్సాపూర్): దంపతుల మధ్య జరిగిన చిన్నగొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. ఈసంఘటన మండలంలోని తునికిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతాత స్వాతికి హత్నూర మండలం మంగాపూర్‌కు చెందిన చైతన్య(24)ను ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అనంతరం ఇల్లరికం అల్లుడిగా తీసుకువచ్చారు. ప్రస్తుతం వీరికి పాప ఉంది. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో శుక్రవారం దంపతుల మధ్య సంసారం, డబ్బుల విషయంతో గొడవ జరిగింది. దీంతో చైతన్య మంగాపూర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి గ్రామ శివారులోని ఖలీల్‌సాగర్ చెరువులో దూకి చనిపోతున్నానని వేరే వ్యక్తి మొబైల్‌తో భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే చెరువులో దూకాడు. మృతదేహాన్ని వెతికితీసి బోరున విలపించారు.


