భూ సేకరణలో చేతివాటం!
● నలుగురు బినామీల పేరిట రూ.35 లక్షలు స్వాహా ● నష్టపోయిన రైతులకు మాత్రం మొండిచేయి ● పంపకాల్లో తేడాలతో విషయం బయటకు
రోడ్డు విస్తరణలో భూములు పోనివారికి పరిహారం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ రైతు పేరు మేఘావత్ పంగి. మెదక్ జిల్లాలోని హవేళిఘనాపూర్ మండలం సోచమ్మరాళ్ గ్రామం. మెదక్–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి విస్తరణలో 10 గుంటల భూమి పోయింది. కానీ ఆమెకు ఇప్పటికి పైసా పరిహారం అందలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈమెతో పాటు అర్హులైన ఎంతోమంది బాధితులకు పరిహారం ఇవ్వలేదు. కానీ అసలు భూమిపోని వారికి మాత్రం పరిహారం ఇచ్చారు.
మెదక్‌జోన్: మెదక్ నుంచి నిజామాబాద్ జిల్లాను కలిపే–ఎల్లారెడ్డి, రుద్రూర్ 765(డీ) రహదారి డబుల్‌రోడ్డు నిర్మాణం కోసం 2021 నోటిఫి కేషన్ విడుదల కాగా.. అదే ఏడాది అక్టోబర్ 22లో జాతీయరహదారుల అథారిటీ గెజిట్‌ను విడుదల చేసింది. ఈ రోడ్డు 62.92 కిలోమీటర్లకు గాను రూ.426.52 కోట్ల అంచనాతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా పరిధి, మెదక్ పట్టణం ధ్యాన్‌చంద్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వరకు 44 కిలోమీటర్లకు టెండర్ దక్కించుకుని పనులు కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణం 2026 వరకు పూర్తి కావాల్సి ఉంది.
భూమి పోని రైతులకు పరిహారం!
రహదారి విస్తరణలో భాగంగా పోచమ్మరాళ్ గ్రామంలో భూమి పోని ఆరుగురు రైతులకు రూ. 47లక్షల పైచిలుకు చెల్లించారు. కాగా ఆ రైతులకు సంబంధించిన భూమి గ్రామ పరిసర ప్రాంతంలో ఉంది. అసలు రోడ్డు విస్తరణలో భూమే పోలేదు. కాగా ఓ మహిళా రైతుకు రూ. 13.50 లక్షల పరిహారం మంజూరి కాగా సదరు మహిళ భూమి పోలేదని అదే గ్రామానికి చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఆమె డబ్బులను చెల్లించకుండా బ్యాంకులోనే నిలిపివేశారు. మరో ముగ్గురు రైతుల భూమి పోకున్నా 10 గుంటల భూమి పోతుందని తప్పుడు రికార్డులు సృష్టించి ఓ మధ్యవర్తి ద్వారా అధికారులు వారి అకౌంట్లో రూ. 35 లక్షలు జమచేశారు. తరువాత ఆ డబ్బులను తీసుకున్నట్లు తెలిసింది. కాగా వీటి పంపకాల్లో అధికారులకు, సదరు మధ్యవర్తికి తేడా రావటంతో ఈ విషయం బయటకు పొక్కింది.
భూ సేకరణలో అవకతవకలు!
మెదక్ నుంచి జిల్లా సరిహద్దు గ్రామం పోచమ్మరాళ్ వరకు రోడ్డు విస్తరణ కోసం అవసరమైన 11.65 హెక్టార్ల భూమి సేకరించేందుకు 84 మంది రైతులకు నోటీసులు అందించారు. ఇందులో 10.39 హెక్టార్ల భూమి తీసుకునేందుకు రైతులను ఒప్పించారు. ఎకరాకు రూ.8.34 లక్షలుగా ధర నిర్ణయించారు. కాగా పట్టాభూమి, అసైన్డ్ భూమికి సైతం ఒకే ధరను నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోచమ్మరాళ్ గ్రామంలో 29 మంది రైతులకు చెందిన 5 ఎకరాల భూమి పైచిలుకు సంబంధించి పరిహారంగా రూ.14.83 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా 24 మంది రైతులకు రూ.12.64 కోట్ల పరిహారం చెల్లించారు.
ఫిర్యాదు రావటంతో ఆపాం
పోచమ్మరాళ్ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు భూమి పోకున్నా ఆమె ఖాతాలో రూ.13.50 లక్షలు పడ్డాయి. అది తప్పు అని ఫిర్యాదు రావటంతో నిలిపి వేశాం.
– సింధూరేణుక, తహసీల్దార్,
హవేళిఘనాపూర్
నిర్మాణంలో ఉన్న మెదక్–ఎల్లారెడ్డి రహదారి
భూ సేకరణలో చేతివాటం!


