వస్త్రాల తయారీలో నేతన్నల కృషి భేష్
గజ్వేల్‌లో పర్యటించిన రష్యాకు చెందిన ప్రొఫెసర్ల బృందం
గజ్వేల్‌రూరల్: చేనేత వస్త్రాల తయారీలో నేతన్నల కృషి అభినందనీయమని, ఈ వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందని నొసిబిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొనియాడారు. రష్యాలోని నోసిబిల్ యూనివర్సిటీకి చెందిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రొఫెసర్ ఆండ్రీ, ప్రొఫెసర్ లూపా, ప్రొఫెసర్ అలీనాలు ఈనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న ఏఐ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి అనూప్ ఆధ్వర్యంలో బుధవారం గజ్వేల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పద్మశాలి చేనేత సహకార సంఘం భవనంలో వస్త్రాల తయారీని పరిశీలించారు. వీరికి పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవదాసు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌లు చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని వివరించారు. అనంతరం పట్టణంలోని భగవాన్ సత్యసాయి దేవాలయాన్ని దర్శించుకొని తెలుగులో శ్లోకాలను పాడి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ప్రొఫెసర్ల బృందం సభ్యులచే రామనామాలను లిఖింపజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇండియా–రష్యా మిత్రదేశాల మాదిరిగా మోడీ, పుతిన్‌లు మంచి మిత్రులన్నారు. భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలంటే తమకు ఇష్టమని, ఇక్కడి ఆచారాలంటే తమకు గౌరవమని అన్నారు. కాగా సాయంత్రం వేళ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంను సందర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వీరి వెంట పద్మశాలి యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌తో పాటు పద్మశాలి, యువజన సంఘం సభ్యులు ఉన్నారు.


