మొగ్గు మున్సిపాలిటీకే
పోస్టింగ్ కోసం చూస్తోన్న
విలీన కార్యదర్శులు
మొదటి, రెండు విడతల
వారి నుంచి ఆప్షన్లు
మరో పది రోజుల్లో విధుల కేటాయింపు!
సంగారెడ్డి జోన్: మున్సిపపాలిటీలలో విలీనమైన గ్రామపంచాయతీల కార్యదర్శులు మున్సిపల్ శాఖలో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పలు గ్రామపంచాయతీలను కలుపుతూ నాలుగు విడతల్లో కొత్త మున్సిపాలిటీలను ఏర్పా టు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ విలీన కార్యదర్శులు నేటి వరకు మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ పంచాయతీరాజ్ శాఖ ద్వా రా వేతనాలు పొందుతున్నారు. వీరు పీఆర్ శాఖలోనే కొనసాగుతారా? లేక మున్సిపల్ శాఖలోకి మారుతారో తమ నిర్ణయాన్ని తెలపాలంటూ ఐదు రోజుల క్రితం విలీన కార్యదర్శులకు ప్రభు త్వం ఆదేశించింది. గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, కోహీర్ కొత్తగా మున్సిపల్‌గా ఏర్పా టు కాగా అమీన్‌పూర్, తెల్లాపూర్‌లో పలు పంచాయతీలు వీలినం అయిన సంగతి తెలిసిందే.
మున్సిపల్ శాఖలోనే పనిచేసేందుకు ఆసక్తి
జిల్లాలో 45 గ్రామ పంచాయతీలు విలీనం కాగా ప్రస్తుతానికి మొదటి రెండు విడతల్లో విలీనమైన కార్యదర్శుల నుంచి మాత్రమే వివరాలు సేకరించింది. అయితే ఇందులో మొదటి రెండు విడతల్లో 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వారి నుంచి ఆప్షన్లు సేకరించే నాటికి ఒకరు పదవీ విరమణ చెందారు. మరొకరు గ్రూప్ 2 ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మరో నలుగురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించడంతో తిరిగి యథా స్థానాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 19 మంది కార్యదర్శుల నుంచి వివరాలు సేకరించ గా 14 మంది మున్సిపల్‌లోకి, ఐదుగురు పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతూ తమ నిర్ణయం తెలిపారు. ము న్సిపల్ శాఖలో పదోన్నతులు త్వరితగతిన లభి స్తాయని ఆలోచనతో ఆ శాఖపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. గ్రేడ్‌ల ఆధారంగా త్వరితగతిన మున్సిపల్ కమిషనర్ వరకు అవకాశాలు లభిస్తా యని చెబుతున్నారు. అభిప్రాయ సేకరణ పూర్తి కావడంతో మరో పది రోజుల్లో కోరుకున్న విధంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలో విధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


