మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
సిద్దిపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సిద్దిపేటఅర్బన్: మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి సమీర్ రాజ్ కృష్ణ, అతని తల్లి వీణ తెలిపిన వివరాల ప్రకారం.. సమీర్ రాజ్ కృష్ణ మొదటి సంవత్సరం చదువుతుండగా అదే కళాశాలకు చెందిన సెకండ్, థర్డ్ ఇయర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు కలిసి ఈ నెల 17న లైబ్రరీకి రావద్దు, గడ్డం ఎందుకు పెంచుకున్నావ్ తీసేసుకో అంటూ బలవంతంగా గడ్డం తీసేయించారు. ఈ విషయాన్ని తన తల్లి వీణకు తెలపగా కాలేజీలోని యాంటీ ర్యాగింగ్ కమిటీకి చెప్పాలని సూచించగా కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కమిటీకి ఎందుకు ఫిర్యాదు చేశావంటూ మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ కమిటీ రెండవ సారి విచారిస్తామని చెప్పగా బాధిత విద్యార్థి తల్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా తనను పట్టించుకోలేదని, ర్యాగింగ్ చేసిన విద్యార్థులకే సపోర్ట్‌గా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడకుండా విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధిత విద్యార్థి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు త్రీటౌన్ సీఐ తెలిపారు.


