ఎస్సై సారు నన్ను కాపాడిండు
● ఆయనకు రుణపడి ఉంటా
● హత్యాయత్నం నుంచి బయటపడిన ఫిర్యాదుదారుడి ఆవేదన
సిద్దిపేటరూరల్: సుపారీ తీసుకుని తనను చంపేందుకు ప్రయత్నించిన వారి నుంచి ఎస్‌ఐ సారు కాపాడిండు. సారుకు చచ్చేదాకా రుణపడి ఉంటానని ఓ ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల చిన్న గుండవెల్లి గ్రామానికి చెందిన పుల్లగూర్ల ఎల్లారెడ్డిపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఎస్‌ఐ రాజేశ్ చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐకి కృతజ్ఞతలు తెలిపారు. వారిని పట్టుకోకపోతే నా ప్రాణాలు తీసే వారని, మీరు లేకపోతే నా కుటుంబం రోడ్డు పాలయ్యేదని ఎస్‌ఐని పట్టుకొని బాధను వ్యక్తం చేశాడు. తాను తన కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్‌ఐ పనితీరు బాగుందంటూ పలువురు అభినందనలు తెలిపారు.


