● డ్రైవర్ అప్రమత్తతతో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ●
శభాష్.. దత్తన్న
జహీరాబాద్: విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ స్కూల్ బస్‌కు మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రావూస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిధిన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ బస్సులో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా మంటలు వ్యాపించాయన్నారు. వెంటనే డ్రైవర్ దత్తు అప్రమత్తమై బస్సును నిలిపివేసి విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. అనంతరం మరో బస్సులో విద్యార్థులను తమ ఇళ్లకు తరలించారని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించినందుకు యాజమాన్యం ఆయనను సత్కరించి నగదు పారితోషికం అందజేసింది. ఈ సమావేశంలో అడ్మిన్ డైరెక్టర్ విశ్వాస్‌రావు, స్టేట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ విజయ, వైస్ ప్రిన్సిపాల్ రేణుక పాల్గొన్నారు.


