పల్లె ప్రగతి ఎలా ఉంది?
జార్ఖండ్ అధికారుల బృందం ఆరా
గజ్వేల్‌రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జార్ఖండ్ అధికారుల బృందం పరిశీలించింది. బుధవారం ఎన్‌ఐఆర్‌డీలోని రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన 26 మంది అధికారుల బృందం ఫీల్డ్ విజిట్‌లో భాగంగా టీమ్ లీడర్ నిహాల్, ఎన్‌ఐఆర్‌డీ కోఆర్డినేటర్ ఆరీఫ్‌ల ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించారు. మండలంలోని దిలాల్‌పూర్‌లో పల్లె ప్రకృతివనం, సోక్‌పిట్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, వైకుంఠధామం, పండ్లతోటల్లో భాగంగా డ్రాగన్ ఫ్రూట్, బెజుగామలో పల్లె ప్రకృతివనం, రైతు వేదిక, బయ్యారంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ బృందం సభ్యులకు నోడల్ అధికారి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏపీవో సురేందర్ స్థానికంగా జరిగిన పనులకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


