బీమా పరిహారం పెంపు
అవగాహన కార్యక్రమాలు
● జిల్లాలో 3 డివిజన్లు
● 25వేల మంది కార్మికులు
మెదక్ కలెక్టరేట్: భవన నిర్మాణ కార్మికుల కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రత్యేక బీమా పరిహారాన్ని పెంచింది. గతంలో ప్రమాదవశాత్తు మృత్యువాత పడినా..అంగవైకల్యానికి గురై మంచాన పడినా వారిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడేది. దీంతో కార్మికుల కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
పెరిగిన బీమా సొమ్ము..
ఇప్పటికే కార్మికశాఖలో ఆన్‌లైన్ ద్వారా నమోదు పొందిన కార్మికులకు సాధారణ మరణం పొందితే రూ.1.30లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే కేంద్రం రూ.6లక్షల పరిహారం అందిస్తుంది. ప్రస్తుతం ప్రభు త్వం ఈ బీమా పరిహారాన్ని పెంచింది. కార్మికులు సాధారణ మరణం పొందితే రూ.1.30లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచింది. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6లక్షల నుంచి రూ.10లక్షల వరకు, ప్రమాదవశాత్తు కార్మికుడు పాక్షిక వైకల్యం పాలైతే రూ.4లక్షలు, పూర్తి వైకల్యానికి గురైతే రూ.5లక్షల పరిహారం అందేలా మార్పులు చేసింది. రిజిస్ట్రేషన్ కానీ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 వేలతో ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
నమోదు చేసుకుంటే చాలు
భవన నిర్మాణ రంగ కార్మికులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని లేబర్‌కార్డు పొందితే చాలు బీమా వర్తిస్తుంది. ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టుసైజు ఫొటోలతో మీసేవ కేంద్రంలో సంప్రదిస్తే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫీజు రూ.110 ఉంటుంది. దాన్ని కలెక్టరేట్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అనంతరం కార్డు వస్తుంది. జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట కార్మిక సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న కార్మికులు 25వేల మంది ఉన్నారు.
ప్రయోజనాలు
ప్రమాద బీమానే కాకుండా కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు, డెలీవరిలకు సైతం కార్మికశాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. కార్మికుడు లేదా కార్మికులికి సంబంధించిన మొదటి ఇద్దరు కూతుర్ల పెళ్లికి రూ.30వేల చొప్పున రూ.60వేలు, అనంతరం రెండుసార్లు డెలీవరీలకు రూ.30వేల చొప్పున రూ.60వేలు మొత్తం రూ.1.20లక్షలు అందిస్తుంది. అలాగే కార్మికులు అనారోగ్యానికి గురై మంచాన పడినా కొంత పరిహారం ఇస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
భవన నిర్మాణ కార్మికులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని లేబర్‌కార్డు పొందాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. కార్మికులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సత్యేంద్ర ప్రసాద్,
జిల్లా ఇన్‌చార్జి సహాయ కార్మిక అధికారి
పెరిగిన బీమా పరిహారంపై కార్మికులకు తెలిజేసేందుకు ఈనెల 24న కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్మికులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం నుంచి కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 8 వరకు కొనసాగించనున్నారు.


