కాపర్‌వైర్ దొంగల అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: కాపర్‌వైర్ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు పంపించారు. మంగళవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 18న ప్రగతి ధర్మారంలోని మహేశ్వరి బిన్ని రైస్ మిల్లులో షట్టర్ తాళం పగులగొట్టి గుర్తుతెలియని దొంగలు కాపర్ వైర్లు, మోటార్లు, బ్యాటరీలు, ఎర్తింగ్ ప్లేట్లు తదితర విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ బాలరాజు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈనెల 24న సాయంత్రం 6 గంటలకు రామాయంపేట – ప్రగతి ధర్మారం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గూడ్స్ వాహనంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు రామాయంపేటతో పాటు చేగుంట, మెదక్, తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట, గౌరారం ప్రాంతాల్లో మొత్తం 8 దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన వస్తువులను మేడ్చల్‌లోని ఒక స్క్రాప్ షాప్‌కు విక్రయించారు. పట్టుబడిన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ సాధిక్ ఖాన్, బహదూర్, అనిల్, రామ్ కేవల్, ప్రదీప్ సహాని, రామ్ కిస్కేవత్ ఉన్నారు. పరారీలో ఉన్న మరోముగ్గురి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితుల నుంచి గూడ్స్ వాహనం, కట్టింగ్ మెషీన్లు, రంచీలు, ఇనుప రాడ్లు, స్క్రూ డ్రైవర్లు, సుమారు 2 కిలోల కాపర్ వైర్లు, రూ.610 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.10లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్‌ఐ, బాలరాజు, కానిస్టేబుళ్లు నాగభూషణం, భాస్కర్‌ను ఎస్పీ అభినందించారు.


