తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఆరు తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలు అపహరణ
తూప్రాన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీ సొత్తును అపహరించారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని సాయినగర్ కాలనీలో మజీద్ పక్కన మూడో అంతస్తులో అస్రఫ్‌అలీ నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో కింది అంతస్తులో నిద్రిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇదే అదునుగా భావించిన దొంగలు పైఅంతస్తులోని ఇంటి తాళం కట్టర్‌తో కట్ చేసి, బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు, విదేశీకి చెందిన విలువైన రెండు చేతి గడియరాలు, రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. ఉదయం గమనించిన అస్రఫ్‌అలీ పోలీసులకు తెలుపడంతో ఎస్సై శివానందం క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా పక్కనే ఉన్న మరో ఇంటి మెట్లపై రక్తం మరకలు ఉండటంతో దొంగలకు గాయాలైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అల్లాదుర్గంలో ఆటో..
అల్లాదుర్గం(మెదక్): ఇంటి ముందు నిలిపిన ఆటోను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం అల్లాదుర్గంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన రాజు ఏపి 23వై 4670 నెంబర్ గల ఆటోను సోమవారం రాత్రి తన ఇంటి ముందు రోడ్డుపై పార్క్ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఆటోను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.


