భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యం
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మండలం, సంగారెడ్డి పట్టణం , కంది మండలం, కొండాపూర్ మండలానికి సంబంధించిన 21లక్షల 33వేల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు కావస్తున్నా మున్సిపాలిటీ, గ్రామాల్లో నయా పైసా అభివృద్ధి లేదన్నారు. ప్రకటనలకు పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో పనులు లేవన్నారు. శంకుస్థాపన చేస్తున్నారే తప్ప పనులు ప్రారంభించడం లేదన్నారు. కాంగ్రెస్ అన్ని రకాలుగా విఫలం అయ్యిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పేద కుటుంబాలకు ఇవ్వాల్సిన చీరలను ప్రభుత్వం ప్రచారం కోసం వాడుకుంటుందన్నారు. గ్రామాలలో స్థానిక ఎన్నికలు ప్రకటన సందర్భంగా ఎన్ని చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు.


