సంగారెడ్డి జోన్: ప్రజావాణికి 76 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారుల ఎదుట ప్రజలు వాపోయారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. కాగా, ప్రజావాణిలో ట్రైసైకిళ్లు కోసం వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్ సత్వరమే స్పందించి, పంపిణీ చేస్తున్నారు. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వంద మందితో కవాతు
ఉత్సాహంగా ఎన్‌సీసీ దినోత్సవం
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం 77వ ఎన్‌సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు వంద మంది క్యాడెట్లతో కవాతు నిర్వహించారు. 1948లో స్థాపించిన నేషనల్ క్యాడెట్ కార్‌ప్స్(ఎన్‌సీసీ), భారతదేశ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవ, దేశ నిర్మాణాన్ని పెంపొందిస్తున్న విషయం విదితమే. ఈ వేడుకలు క్యాడెట్ల సమావేశం, కవాతుతో ప్రారంభమయ్యాయి. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు జెండా ఎగురవేయగా, క్యాడెట్లు ఎన్‌సీసీ ప్రతిజ్జ చేసి, విధి, జాతీయ విలువల పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మెరుగైన వైద్యం అందించాలి
చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పద్మజ
కంది(సంగారెడ్డి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారందరికీ సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్టేట్ చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ సూచించారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ల్యాబ్‌లో నిర్వహిస్తున్న రక్తపరీక్షల ఫలితాలను ఎప్పటి కప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిరంజన్, డాక్టర్ కరుణశ్రీతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రణభేరి సభనుజయప్రదం చేయండి
జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్
సంగారెడ్డి టౌన్: గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న సూర్యాపేటలో నిర్వహించనున్న గీతన్నల రణభేరి బహిరంగసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గీత కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, గ్రామాల్లోని బెల్టు షాపులను నిలిపేయాలన్నారు. అనంతరం సంగారెడ్డిలోని ఐబీలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగాగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు, గీత కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 76 దరఖాస్తులు
ప్రజావాణికి 76 దరఖాస్తులు


