149 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ముంబై హైవే, నాందేడ్ అకోల హైవేల పక్కన..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ వాహనాల (ఈవీ)కు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లను జిల్లాలో విస్తృతంగా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 149 చోట్ల వీటిని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా ముంబై హైవేతో పాటు, నాందేడ్–అకోలా హైవేలపై ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, కొల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా వీటిని నెలకొల్పడం ద్వారా వాహనదారులకు ఎంతో సౌకర్యం ఉంటుందని భావిస్తున్నారు. 65వ జాతీయ రహదారి జిల్లాలో రామచంద్రాపురం నుంచి మొగుడంపల్లి మండలం మాడ్గి వరకు ఉంటుంది. సుమారు 104 కి.మీల పొడవున్న ఈ ముంబై హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వీటిలో విద్యుత్ వాహనాలు కూడా ఉంటాయి. ఈ హైవేపై ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తే దూర ప్రయాణాలు చేసే విద్యుత్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే కంది మండల కేంద్రం కల్హేర్ మండలం మాసన్‌పల్లి చౌరస్తా సుమారు 95 కి.మీల మేరకు 161 జాతీయ రహదారిపై కూడా వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రహదారిపైనా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రధానంగా ఈ రెండు జాతీయ రహదారులపై వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాహనదారులు వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
పెరుగుతున్న ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా..
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. గతంతో పోల్చితే ఈ వాహనాల ధరలు కొంత మేరకు దిగి వస్తున్నాయి. ప్రారంభంలో అధిక ధరలు ఉండటంతో కొనుగోలు చేయాలంటే కొంత ఆర్థిక భారం పడేది. ఇప్పుడు ధరలు దిగివస్తుండటంతో ఎక్కువ మంది ఈవీ వాహనాలను కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాను న్న రోజుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగే ఈ వాహనాల దృష్ట్యా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కలెక్టర్ ప్రావీణ్య దృష్టి సారించారు.
ప్రభుత్వ భూముల గుర్తింపు
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని యోచిస్తున్నారు. వీటి ఏర్పాటుకు అనువుగా ఉన్న స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై దృష్టి సారించనున్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలను గుర్తించి విద్యుత్ శాఖకు అప్పగిస్తే ఆ స్థలాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈవీ స్టేషన్లకు అవసరమైన ప్రత్యేకంగా కనెక్షన్, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర ఏర్పాట్లు చేస్తామని సంగారెడ్డి విద్యుత్‌శాఖ సంగారెడ్డి సర్కిల్ చీఫ్ ఇంజనీర్ కామేష్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈవీ స్టేషన్లలో వాహనాలను చార్జింగ్ చేసుకునే వారు ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.


