రూ. 2,200 కోట్ల రుణాలు
● అధిక వడ్డీతో స్వర్ణనిధి స్కీమ్ ● డిపాజిట్ చేసిన వారికిరూ.5లక్షల ఇన్సూరెన్స్ ● డీసీసీబీ డీజీఎం చంద్రశేఖర్‌రెడ్డి
నారాయణఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.2,,200కోట్ల రుణాలు అందేశామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్‌లోని డీసీసీబీ శాఖను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఖాతాదారులతో స్వర్ణనిధి డిపాజిట్ స్కీమ్‌కు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. పంటరుణాలు రూ.650 కోట్లు, మహిళా సంఘాలకు రూ.490 కోట్లు, బంగారు ఆభరణాలపై రూ.480కోట్లు, గృహ నిర్మాణ రుణాలు రూ.130కోట్లు అందజేసినట్లు చెప్పారు. రుణాలు పొందిన వారు బకాయిలు సకాలంలో చెల్లించి అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఖేడ్ బ్రాంచిలో 104కోట్లు అన్నిరకాల రుణాలు ఇవ్వగా.. డిపాజిట్ రూపేణా రూ.31కోట్లు సేకరించినట్లు చెప్పారు. ఈ బ్రాంచిలో పెద్ద లాకర్ సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు.
10 నిమిషాల్లో ఖాతా, రుణం కూడా..
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా అత్యుత్తమ సేవలు అందిస్తూ అన్ని కమర్షియల్ బ్యాంకులంటే అధిక వడ్డీని అందిస్తున్నామని డీజీఎం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమ ఖాతాదారులకు ఏటీఎం సదుపాయాలు కల్పిస్తూ డెబిట్ కార్డులు అందిస్తున్నామని, ఫోన్‌పే, గూగుల్‌పే తదితర అన్ని సదుపాయాలు పొందవచ్చని అన్నారు. కొత్త ఖాతాదారులకు 10 నిమిషాల్లోనే ఖాతా తెరచి ఇస్తామన్నారు. బంగారు ఆభరణాలు, తులం బంగారంపై రూ.74వేల వరకు రుణాన్ని పదినిమిషాల్లోనే అందజేస్తామన్నారు. బ్యాంకుల్లో లాకర్ సదుపాయాలు ఉన్నాయని, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెలాఖరుతో స్వర్ణనిధి 444 రోజుల ఫిక్స్ డిపాజిట్ నూతన పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఇందులో డిపాజిట్ చేస్తే 7.75శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 8.25శాతం వడ్డీ అందజేస్తామన్నారు. డిపాజిట్ చేసిన వారికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉందన్నారు. సమావేశంలో బ్రాంచి మేనేజరు జాదవ్ కిషన్, రికవరీ అధికారి రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


