పేదలకు అత్యాధునిక వైద్యం
● త్వరలో సూపర్ స్పెషాలిటీఆస్పత్రిని ప్రారంభిస్తాం ● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు టౌన్: కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆస్పత్రి వైద్యులు, టీజీఎంఎస్‌ఐడీసీ విభాగం అధికారులతో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రూ.187 కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయిని, త్వరలోనే ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఆస్పత్రి సివిల్ పనులు పూర్తయ్యాయని, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ మెషిన్, ఇతర పరికరాల కోసం రూ.23 కోట్ల 56 లక్షల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పేదలకు సైతం అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఈన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ షరీఫ్, ఈఈ రవీందర్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి డాక్టర్ చంద్రశేఖర్, ఆస్పత్రి సలహా సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


