పత్తి చేను మేసి 16మేకలు మృతి
ఆదుకోవాలని బాధితుడి వినతి
న్యాల్‌కల్(జహీరాబాద్): మేకలు మేత మేస్తూ ఉన్నట్లుండి మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండల పరిధిలోని మొల్కన్‌పాడ్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మేతరి సంజీవ్ రోజు మాదిరిగానే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేకలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లాడు. ఓ రైతుకు చెందిన (పత్తి తీసిన) చేనులో మేకలను మేపాడు. ఈ క్రమంలో ఉన్నట్లుండి కడుపుబ్బి నురుగలు కక్కుకొని ఒక్కొక్కటిగా 16 మేకలు మృతి చెందాయి. ఈ విషయాన్ని రెవెన్యూ, పశు వైద్యాధికారులకు బాధితుడు తెలిపాడు. ఆర్‌ఐ శ్యాంరావు, పశు వైద్యాధికారి గణేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన మిగిలిన మేకలకు పశువైద్యుడు చికిత్స అందించాడు. పత్తి చెట్లు, వాటి కాయల్లో విషం ఉంటుందని, వాటిని తినడంతో గాసిపాల్ విషం సోకి మేకలు మృతి చెంది ఉండవచ్చునని వైద్యుడు అనుమానం వ్యక్తం చేశాడు. పోస్టుమార్టంలో మేకల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. కాగా మృతి చెందిన మేకల విలువ సుమారు 2.40 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
మృతి చెందిన మేకలు


