నాన్నా.. అప్పులతో వేగలేకపోతున్నా
తండ్రికి ఫోన్ చేసి ఉరి వేసుకున్న యువకుడు
రామాయంపేట(మెదక్): అప్పుల బాధతో చనిపోతున్నానని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన నింగరమైన బాలేశ్ (26) కూలీ పనులు చేసుకుంటూ తన భార్య, ఏడాది వయస్సుగల కుమారున్ని పోషించుకుంటున్నాడు. ఉదయం బాలేశ్‌కు, భార్య కనకలక్ష్మికి మధ్య అప్పుల విషయమై గొడవ జరిగింది. తరువాత అతడు ఇంటినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అతడు హైదరాబాద్‌లో ఉంటున్న తన తండ్రి లచ్చయ్యకు ఫోన్ చేసి అప్పుల బాధతో వేగలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సమాచారం అందుకున్న కనకలక్ష్మి, మరి కొందరితో కలిసి తన భర్త ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బోయ రాములు వ్యవసాయ క్షేత్రంలో చింతచెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది కనిపించాడు. అప్పులు తీర్చే మార్గం లేకే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


