కౌంట్‌డౌన్
ముగియనున్న మల్లన్న పాలక మండలి గడువు
కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలక మండలి గడువు డిసెంబర్ 6తో ముగుస్తుంది. ఆలయ నూతన పాలక మండలికి దేవాదాయ శాఖ ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. డిసెంబర్ 14 స్వామి వారి కల్యాణం , జనవరి 18 నుంచి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి నిత్యం వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకునే ఆలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసే పాలక మండలి గురించి దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడంతో స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం చిన్న చూపే..
ఆలయంలో ప్రతిసారి 14 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిసి 15 మందితో పాలక మండలిని దేవాదాయ శాఖ అధికారులు నియమిస్తారు. కానీ గత సంవత్సరం డిసెంబర్ 6న 8మంది ధర్మకర్తలు, ఎక్స్ అఫీషియో సభ్యునితో కలిపి 9మందితో పాలక మండలిని ప్రకటించింది. మిగితా ఆరుగురి కోసం మళ్లి నోటిఫికేషన్ విడుదల చేయగా 43 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా దానిని అధికారులు పట్టించుకోలేదు. డిసెంబర్ 6తో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం కమిటీ ప్రకటించే 45 రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అప్పుడు ఆశావహులు దరఖాస్తు చేసుకున్న అనంతరం పోలీస్‌శాఖ ఎంకై ్వరీ పూర్తి కాగానే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి సంబంధిత శాఖ మంత్రి 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రకటిస్తారు. కానీ, డిసెంబర్ 6న పాలక మండలి గడువు ముగియడం, 14న స్వామి వారి కల్యాణం జరుగనున్న నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు రెగ్యులర్ కమిటీని నియమించే అవకాశం కనబడటం లేదు. ఉత్సవ కమిటీ నియమించే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నా..ఏ అధికారాలు లేని ఉత్సవకమిటీ నియమిస్తుందా?..కమిటీ లేకుండా ఉత్సవాలను దేవాదాయ శాఖ నిర్వహిస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సమీపిస్తున్న కొమురవెల్లి మల్లన్న కల్యాణం
ఉత్సవ కమిటీతో సరిపెట్టే యోచనలో దేవాదాయ శాఖ
నూతన మండలికి నోటిఫికేషన్ లేనట్టే!


