పనిచేసిన కంపెనీకి కన్నం వేశారు
● మొత్తం 11మంది అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏసీపీ
సిద్దిపేటకమాన్: పని చేసిన కంపెనీలోనే చోరీకి పాల్పడిన ఘటనలో మొత్తం 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సిద్దిపేట వన్‌టౌన్ సీఐ వాసుదేవరావుతో కలిసి ఏసీపీ రవీందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గాడిచర్లపల్లి శివారు మెగా కంపెనీ యార్డులో రంగనాయక సాగర్ కాల్వకు సంబంధించిన ఇనుప పైపులు చోరీకి గురైనట్లు ఉద్యోగి సాగర్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కంపెనీలో గతంలో వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేసిన బీహార్‌కు చెందిన రోహిత్, పైపులకు పెయింటింగ్ వర్క్ చేసే హైదరాబాద్‌కు చెందిన చాలమల్ల వెంకట్‌రెడ్డి, సెక్యూరిటీ గార్డు ములుగు సాయికుమార్‌తో కలిసి ఇనుప పైపులను దొంగిలించాలని పథకం రచించారు. గత నెల 26,27వ తేదీల్లో రెండు దఫాలుగా పైపులను దొంగిలించి వాటిని ముక్కలుగా చేసి క్రేన్‌ల సాయంతో లారీల్లో తరలించారు. పట్టణానికి చెందిన స్క్రాప్ షాప్ నిర్వాహకుడి సాయంతో పైపులను మనోహరాబాద్, శంకరంపేట ఐరన్ కంపెనీల్లో విక్రయించి వచ్చిన డబ్బులను రోహిత్, వెంకట్‌రెడ్డి, సాయిలు, శ్రీనివాస్ పంచుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు వీరికి సహకరించిన శ్రీనివాస్,క్రేన్ యజమానులు, లారీ ౖడ్రైవర్లు, దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఎండీ లియాఖత్, ఎండీ వాజీద్, శ్రీకాంత్, ముంగిస్పల్లీ, రమేశ్, సతీశ్, పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.40లక్షల విలువైన 60టన్నుల ఇనుప పైపులు, రూ.3.95లక్షల నగదు, రెండు క్రేన్లు, బొలెరో వాహనం, రెండు లారీలు, గ్యాస్ కటింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు.


