తల్లీ, కొడుకుల అదృశ్యం
మెదక్ మున్సిపాలిటీ: నాలుగేళ్ల కొడుకుతోపాటు తల్లీ అదృశ్యమైంది. ఈ సంఘటన మెదక్ పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మహేశ్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన గొలుసుల అనీత నాలుగేళ్ల కొడుకు శివకుమార్‌ను తీసుకొని ఈనెల 6న ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. ఆరోజు నుంచి బంధువులు, స్థానికంగా వెతికినా వారి ఆచూకీ లభించలేదు. భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయిపల్లిలో
రాయిపల్లిలో బాలిక..
రాయికోడ్(అందోల్): కూలీ పనికోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన మండలంలోని రాయిపల్లిలో చోటు చేసుకుంది. రాయికోడ్ ఎస్‌ఐ చైతన్యకిరణ్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ కుటుంబం గత కొన్ని రోజుల క్రితం పత్తితీత పనులకు రాయిపల్లికి వచ్చారు. గ్రామంలో తాత్కాలిక టెంట్స్ ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం అనంతరం నిద్రించారు. వేకువ జామున నిద్రలేచి చూసేసరికి 16 ఏళ్ల బాలిక కన్పించకపోవడంతో తండ్రి చుట్టూ పక్కల వారి వద్ద, గ్రామంలో వెతికాడు. ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
కారు ఢీకొని
వృద్ధుడికి గాయాలు
కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తా సమీపంలోని 161 నేషనల్ హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా ఆరేడు గ్రామానికి చెందిన విఠల్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానికులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.


