వివాహమైన ఐదు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి
● భర్తకు తీవ్ర గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): వివాహ జీవితంలోకి అడుగు పెట్టిన ఐదు నెలలకే నవ వధువును ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన లోక సాయికిరణ్‌కు, సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కె.ప్రణతి (24)తో ఈ ఏడాది జూలైలో వివాహం అయింది. వృత్తి రీత్యా సాయి కిరణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా ఈ నెల 23న సాయి కిరణ్ సిద్దిపేటలో అత్తగారింట్లో జరిగిన ఓ శుభకార్యానికి భార్యతో వచ్చాడు. తిరిగి సోమవారం సాయి కిరణ్, ప్రణతిలో కలిసి సిద్దిపేట నుంచి, చేగుంట మీదుగా ఇస్నాపూర్‌కు బైక్‌పై బయలు దేరారు. ఈ క్రమంలో చెప్యాల శివారులోకి రాగానే వీరి బైక్‌ను వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న ప్రణతి కింద పడటంతో అక్కడిక్కడే మృతిచెందింది. సాయి కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ శ్రీనివాస్, మిరుదొడ్డి ఎస్‌ఐ సమత ప్రమాద స్థలానికి వెళ్లి అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మామ ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


