అదృశ్యమై.. కుంటలో శవమై..
మృతుడిపై పలు స్టేషన్లలో కేసులు
జిన్నారం (పటాన్‌చెరు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సమీపంలోని ఎల్లమ్మబండకు చెందిన రాజాసింగ్ (30) ఈ నెల 20న ఆస్పత్రికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదేరోజు బొల్లారం పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమీపంలో రాజాసింగ్ కారు, ఎర్రోళ్ల ప్రవీణ్ ద్విచక్రవాహనం ఢీకొన్నట్లు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ వాహనాలను వదిలిపెట్టి ఇద్దరు పరారయ్యారు. ఆ రెండు వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు, కుటుంబ సభ్యు లు రాజాసింగ్ కోసం ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బొల్లారంలోని మాధవనికుంటలో రాజాసింగ్ శవమైతేలాడు. అతడి మృతిపట్ల ఎర్రోళ్ల ప్రవీణ్‌పై అనుమానం ఉన్నట్లు మృతుడి అన్న గోపీసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మృతుడిపై జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కూకట్‌పల్లి, అత్తాపూర్, స్టేషన్లలో చోరీ కేసుల్లో నిందితుడిగా గుర్తించారు.


