పటాన్‌చెరులో భారీ చోరీ
● 45 తులాల బంగారం, వెండి అపహరణ ● భార్య ప్రసవం కోసం ఊరెళ్లడంతో ఘటన
పటాన్‌చెరు టౌన్: తాళం వేసిన ఇంట్లో భారీ బంగారం, వెండిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...సికింద్రాబాద్‌కు చెందిన ఉత్తమ్ అతని కుటుంబంతో తెల్లాపూర్ మున్సిపాలిటీ, పోచారం గ్రామ పరిధిలో ఉన్న సాయి దర్శన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే అతని భార్య ప్రసవం కోసం కుటుంబ సభ్యులందరూ ఈ నెల 16న సికింద్రాబాద్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 45 తులాల బంగారం, కొద్దిగా వెండిని ఎత్తుకెళ్లారు. అయితే ఉత్తమ్ ఇంటి సీసీ కెమెరాల్లో చూసి చోరీ జరిగినట్లు గుర్తించాడు. కాగా ఇంటికి వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


