చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆరోపణ
సంగారెడ్డి టౌన్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని మృతుడి బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబీకులు, బంధువుల వివరాలు ఇలా... నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్(44) వృత్తిరీత్యా 20 ఏళ్లుగా ఎంఎన్‌ఆర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ నెల 20న సాయంత్రం విధులు నిర్వహించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ శివారులో సంతోష్‌ను ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి గాయాలవ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, అతడు విధులు నిర్వహిస్తున్న ఎంఎన్‌ఆర్ ఆసత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కాగా సంతోష్‌కు ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడం వల్లే మరణించాడని కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. యాజమాన్యం శనివారం రాత్రి స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆదివారం ఉదయాన్నే భారీగా పోలీసులు మోహరించారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.


