ఎకరాకు 11.77 క్వింటాళ్లు
నారాయణఖేడ్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎకరాకు సగటున 11.77 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జౌళి శాఖకు నివేదిక సమర్పించింది. కేంద్ర జౌళి శాఖ నుంచి ఎంత సేకరించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని పత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎకరాకు 7 క్వింటాళ్ల మేరకే సీసీఐ సేకరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగుబడులు రెట్టింపుగా ఉన్నాయని, వచ్చిన దిగుబడుల మేరకు కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ వస్తోంది. పత్తి పంట దిగుబడులు ప్రారంభమైన సందర్భంలో గతేడాది తరహాలోనే కపాస్ కిసాన్ యాప్‌లో ఉండగా ఒక్కసారిగా కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఇన్‌లైన్‌లో ఎకరాకు 7 క్వింటాళ్లుగా వచ్చింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
క్షేత్రస్థాయిలో సర్వే..
పంట కొనుగోళ్లపై సమస్య ఉత్పన్నం కావడంతో రాష్ట్రంలో పత్తి సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లాల వారీగా సగటు దిగుబడులపై వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ వారం క్రితం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. పత్తి దిగుబడులు ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ నివేదిక ఇవ్వగా దాన్ని పరిగణలోకి కేంద్ర జౌళి శాఖ రైతుల నుంచి కేవలం 7 క్వింటాళ్ల మేరకే సేకరించాలని సీసీఐని ఆదేశించింది. దీంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట దిగుబడులపై సర్వే చేయాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు వారం రోజుల్లో జిల్లాల వారీగా అయా కలెక్టర్లు నివేదికలు సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దిగుబడులపై కూడా ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు నివేదిక అందజేశారు.
దళారుల పరం..
పత్తి పంట కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ విధించిన నిబంధనల కారణంగా రైతులు దళారులకు పత్తి పంటను అమ్ముకుంటున్నారు. ఎమ్మెస్పీ మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 కాగా, దళారులు రూ.6,500 నుంచి రూ.7వేల లోపే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఆధారంగా యావరేజ్‌గా ఎకరాకు 11.77 క్వింటాళ్ల చొప్పున పత్తి సేకరించాలన్న ఆదేశాలకు కేంద్ర జౌళి శాఖ నుంచి సీసీఐకి అందాల్సి ఉంది. త్వరలో ఈ మేరకు ఆదేశాలు అందే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
పత్తి దిగుబడిపై కేంద్రజౌళి శాఖకు ప్రభుత్వం నివేదన
● ఉమ్మడి జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి
● కపాస్ కిసాన్ యాప్‌లో ఇంకా 7 క్వింటాళ్లే
● జిల్లాలో 3,48,372 ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి నివేదికను తెప్పించారు. ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చినట్లు ప్రభుత్వానికి నివేదించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో పత్తి సగటున దిగుబడులు ఎకరాకు 11.77 క్వింటాళ్ల మేర ఉందని కేంద్ర జౌళి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కలెక్టర్ల నిర్వహించిన సర్వే వివరాలు, గణాంకాలను అందజేశారు. పత్తి కొనుగోళ్లను ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచాలని అభ్యర్థించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చినట్లు నివేదిక సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలో 3,48,372 ఎకరాల్లో పత్తి పంట సాగయ్యింది.


