వడ్డీలేని రుణాల ఘనత కాంగ్రెస్‌దే
వట్‌పల్లి(అందోల్): మహిళలకు వడ్డీలేని రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మండల పరిధిలోని సంగుపేట వద్ద గల ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు ఆత్మసైర్థ్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, తిరిగి వైఎస్‌ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలను, 2013లో వడ్డీలేని రుణాలను అందించేందుకు శ్రీకారం చుట్టి అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వడ్డీలేని రుణాల సంగతే మరిచిపోయామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 30 ఆర్‌టీసీ బస్సులను నడుపుతున్నాయని, ఒక్కో ఆర్‌టీసీ బస్సుకు ప్రభుత్వం రూ.30 లక్షల గ్రాంటును ఇస్తుందని, సంఘం తరఫున రూ.6 లక్షలు మాత్రమేనని వివరించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ల ద్వారా రూ.1.80 కోట్ల ఆదాయం మహిళ సంఘాలకు వచ్చిందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాకు 3 లక్షల చేనేత చీరలను మంజూరు చేసిందని, మరో 2 లక్షల వరకు చీరలు రానున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో పాటు 18 ఏళ్లు నిండి రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతీ ఆడబిడ్డకు చీరలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సంగమేశ్వర్, జిల్లా డీఆర్‌డీవో సూర్యరావు, ఆర్‌డీవో పాండు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, ఐకేపీ డీపీఎం రమేశ్‌బాబు, తహశీల్దార్ మధుకర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్, మండల పార్టీ అధ్యక్షులు శివరాజ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఇందిరమ్మ చీరలు పంపిణీ
సంగారెడ్డి జోన్: మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను ఆదివారం పంపిణీ చేశారు. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు రూ.590 కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రూ.32కోట్ల వడ్డీ రాయితీ అందించినట్లు తెలిపారు. స్వయం ఉపాధి పథకం ద్వారా ఎంతోమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీసీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే
లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలు
18 ఏళ్లు నిండిన
ప్రతీ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర
మంత్రి దామోదర రాజనర్సింహ


