నిశీధిలో నిత్యపోరాటం
చలించని శ్రమైక జీవనం..
సంగారెడ్డిలో..
సంగారెడ్డి జోన్: జిల్లాలో సింగిల్ డిజిట్ చలి తీవ్రత నమోదు అవుతున్నప్పటికీ పారిశుధ్య పనులు నిర్వహించడంలో కార్మికులు వెనుకడుగు వేయడం లేదు. ఉదయం 4 గంటలకే వచ్చి ఫేస్ రికగ్నేషన్ ద్వారా హాజరు వేసుకొని విధుల్లోకి వెళ్తున్నారు. చలి ఉన్నా గ్లౌజులు, స్వెటర్లు వేసుకుని, మొహానికి మాస్క్ ధరించి ఇబ్బందులు పడుతూ శుభ్రం చేస్తున్నారు.
వణుకుతున్న నిరాశ్రయులు
పట్టణంలో నిరాశ్రయులు చలికి వణుకుతున్నారు. బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, రోడ్డు పక్కన, వివిధ ప్రదేశాల్లో దుప్పట్లు కప్పుకొని చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు. నిరాశ్రయులకు షెల్టర్ లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పనులకు వెళ్తూ.. కూలీలు
ప్రస్తుతం పత్తితీత పనులతో పాటు చెరుకు నరికే పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే స్థానికంగా పనులు దొరక్కపోవడంతో ఇతర ప్రాంతాలకు కూలి పనుల కోసం దుప్పట్లు కప్పుకొని వెళ్తున్నారు. చలి ఉన్నప్పటికీ పనులకు వెళ్లక తప్పడం లేదని, పనులకు వెళితేనే ఫూట గడుస్తుందని రైతు కూలీలు చెప్పారు.
3 గంటల నుంచే టీ..
చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా చాయి తాగుతుంటారు. ఉదయం 3 గంటలకే టీ దుకాణాలు తెరుచుకుంటున్నాయి. 8 గంటల వరకు టీ దుకాణాలు రద్దీగా ఉంటున్నాయి. అలాగే టిఫిన్ సెంటర్లు సైతం త్వరగా తెరుచుకుంటున్నాయి. పది రోజులుగా వ్యాపారం బాగా జరుగుతుందని టీ నిర్వాహకులు చెబుతున్నారు.
ఫస్ట్ షిఫ్ట్ ఉంటే తిప్పలే..
సంగారెడ్డితో పాటు పటాన్ చెరు నియోజకవర్గాల్లో అధికంగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ప్రతిరోజు రెండు నుంచి నాలుగు షిఫ్టులు కొనసాగుతుంటాయి. ఫస్ట్ షిఫ్ట్ వెళ్లే వారికి చలికాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 6 గంటల్లోపు హాజరు వేయాలి. అందుకు ఉదయం నాలుగు గంటలకే లేచి ఐదు గంటలకు బస్సులో ప్రయాణిస్తున్నారు.
రైతుల అవస్థలు
వ్యవసాయ పొలాల్లో పండించిన కూరగాయలు, పూలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 3 గంటలకే మార్కెట్‌కు చేరుకుని చలికి వణుకుతూ అక్కడే మంట కాపుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. గ్రామం నుంచి రాకపోకలు సాగించే సమయంలో విపరీతమైన చలి ఉంటుందని అన్నదాతలు వాపోతున్నారు.
మీ గమ్యాన్ని చేరుస్తాం..
ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటో డీసీఎం వాహనాల డ్రైవర్ల కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలి. చలి తీవ్రత, మంచు కురుస్తున్నప్పటికీ వాహనాలు నడిపించక తప్పడం లేదు.
తండ్రిని హైదరాబాద్‌కు తీసుకెళ్తూ..
తెల్లవారు జామున 3.20గంటలకు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర పెట్రోల్ పంప్ 24 గంటలు మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు సుదర్శన్ అనే ఆటోడ్రైవర్ తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. కారు అయితే డబ్బులు అధికంగా తీసుకుంటారని సొంత ఆటోలోనే వెళ్తున్నారు. డీజిల్‌ను రంగధాంపల్లి పెట్రోల్ పంప్‌లో పోయించుకుని వెళ్లారు.
ఏటీఎంకు రక్షణ.. విధులకు సెల్ఫీ..
నర్సాపూర్ చౌరస్తాలోని కెనరా బ్యాంక్ ఏటీఎం వద్ద హరీశ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో ఉన్నట్లు హరీశ్ గంట గంటకు సెల్ఫీ దిగి సెక్యూరిటీ ఆఫీస్ వాట్సప్ గ్రూప్‌లో ఫొటోను పోస్ట్ చేస్తూ అటెండెన్స్ వేసుకుంటున్నాడు.
డ్రంకెన్ డ్రైవ్..
అర్థరాత్రి 12 గంటలకు సిద్దిపేట పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అంతలోనే ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ రావడంతో అతనికి చెక్ చేయగా మద్యం తాగినట్లుగా తేలింది. దీంతో సదరు వాహనదారుని వివరాలు సేకరించారు. అలాగే పలు చోట్ల పెట్రోలింగ్ వాహనాలు దర్శనమిచ్చాయి.
చలిలోనూ విధులు, బాధ్యతలు
తెల్లవారు జాము నుంచే పోరాటం
మెతుకు సీమలో ఉపాధి పోరు
నిశీధిలో నిత్యపోరాటం
నిశీధిలో నిత్యపోరాటం
నిశీధిలో నిత్యపోరాటం


