ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..
సిద్దిపేటరూరల్: రంగోత్సవ్ సెలెబ్రేషన్ ముంబై ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ చిత్రలేఖనం పోటీల్లో గుర్రాలగోంది సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి శనివారం తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్ చిత్రలేఖనం పోటీల్లో పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. కాగా వీరిలో 10 బంగారు పతకాలు, 5 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలు , ఒక ఆర్ మెరిట్ పతకాన్ని విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ఆక్టివిటీస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రతిభ చాటేలా కృషి చేసిన ఆర్ట్ టీచర్ సుకుమార్‌చారిని ఉపాధ్యాయులు అభినందించారు.
జాతీయ కన్వీనర్‌గా
మహేందర్‌రెడ్డి
మెదక్ కలెక్టరేట్: రాజీవ్‌గాంధీ పంచాతీరాజ్ సంఘటన్ జాతీయ కార్యదర్శిగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన మహేందర్‌రెడ్డిని నియమిస్తూ జాతీయ నాయకులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో సంఘటన్ బలోపేతం, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల శక్తివంతం కోసం పనిచేయడానికి ఈ అవకాశం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థికి
యంగ్ సైంటిస్ట్ అవార్డు
మెదక్ మున్సిపాలిటీ: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాపన్నపేట మండలం చీకోడ్ లింగాయపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన శివ చైతన్య యంగ్ సైంటిస్ట్ అవార్డ్‌ను సాధించాడు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 52వ రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని – 2025 జరిగింది. అయితే 10వ తరగతి విద్యార్థి శివ చైతన్య, గైడ్ టీచర్ కిషన్ ప్రసాద్ సహకారంతో రూపొందించిన మిరాక్యూలస్ మల్టీపర్పస్ మల్టీ కాన్సెప్ట్వల్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఫ్యూచర్ అడ్వాన్‌న్స్ ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చరల్ ప్రాబ్లెమ్ సాల్వింగ్, అండ్ ఆల్ ఇన్ వన్ వెహికల్ అనే నూతన ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఈ సందర్భంగా పర్యావరణ్ సంస్కృతి సంరక్షణ్ ఎవమ్ మానవ్ కళ్యాణ్ ట్రస్ట్ చైర్మన్ సుశీల్ కుమార్ యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. కాగా విద్యార్థిని, ఉపాధ్యాయుడిని పలువురు ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..


