రేషన్ బియ్యం స్వాధీనం
పటాన్‌చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ఇలా...అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ముత్తంగి ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు, రామచంద్రపురం విజిలెన్‌న్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, గుజరాత్‌కు లారీలో తరలిస్తున్న (450 బ్యాగులు) 217 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు అక్రమంగా వైద్యనాథ్, లారీ ఓనర్ ఆశిక్, లారీ డ్రైవర్ ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు నమోదు చేశారు.
గ్యాస్ లీకై మంటలు
గజ్వేల్‌రూరల్: పాఠశాలలో విద్యార్థులకు వంటలు చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వచ్చాయి. గమనించిన సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పిన సంఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... సంగుపల్లిలోని యూపీఎస్ పాఠశాలలో శనివారం ఉదయం మధ్యాహ్న భోజన నిర్వాహకులు రాగిజావను తయారు చేస్తుండగా సిలిండర్‌కు ఉన్న రెగ్యులేటరీ వద్ద గ్యాస్ పైపు లీక్ కావడంతో మంటలు వచ్చాయి. సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎంఈవో కృష్ణ, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పాఠశాలకు వచ్చి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
కన్‌సాన్‌పల్లిలో మొసలి
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి పెద్ద చెరువులో వారం రోజులుగా మొసలి సంచరిస్తోంది. చెరువులో మొసలి తిరుగుతుండగా అటువైపు వెళ్లిన గ్రామస్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం చెరువు ఆయకట్టు కింద వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో చెరువు చుట్టూ పక్కల ఉన్న పత్తి పంట తీత పనులు సాగుతున్నాయి. మొసలి తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతుండటంతో అటువైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. కాగా ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా.. మొసలి గురించి సమాచారం లేదని, నీరు ఖాళీ అయితేనే పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.


