కేక్ తేవడానికి వెళ్తుండగా..
మద్దూరు(హుస్నాబాద్): పండుగ వాతావరణం నెలకొన్న ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. కూతురి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలలు కన్న ఆ తండ్రి.. ఆ కలలు నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సింగారం శ్యామ్‌కుమార్(29) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతడి పెద్ద కూతురు జశ్విత పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకురావడానికి మండలంలోని చౌరస్తాకు పల్సర్ బైక్‌పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో మండల నుంచి లద్నూరు వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో శ్యామ్‌కుమార్ ప్రమాదవశాత్తు దానిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలైన శ్యామ్‌కుమార్‌ను స్థానికులు , పోలీసులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య శ్రావణి, కూతుళ్లు జశ్విత,అన్విత,11నెలల కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్పాల సూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం వల్లే శ్యామ్‌కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ,గ్రామస్తులు మృతదేహంతో లద్నూరు, ముస్త్యాల రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సంఘటన స్థలానికి హుస్నాబాద్ ఏసీపీ సదానందం, చేర్యాల సీఐ శ్రీను , తహసీల్దార్ రహీం వచ్చి వారితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కేక్ తేవడానికి వెళ్తుండగా..


