కారుతో ఢీకొట్టి యువకుడి హత్య
కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... జగదేవ్‌పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షాహెద్(25) శనివారం ద్విచక్ర వాహనంపై కుకునూరుపల్లిలో హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోకి రాగానే చాట్లపల్లికి చెందిన ఖాదర్ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఖదీరియా ఘటనా స్థలికి చేరుకున్నారు. కాగా అప్పటికే ఎగుర్ల కర్నాకర్ తీవ్ర గాయాలైన షాహెద్‌ను కారులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. నాలుగు రోజుల క్రితం రాత్రి ఖాదర్ ఫోన్ చేసి మృతుడి తల్లి ఖదీరియాను ఇంటికి రమ్మనడంతో వెళ్లింది. నీ కొడుకు షాహెద్ నా భార్యకు మాటి మాటికి ఫోన్ చేస్తూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వెంటనే మానుకోవాలని చెప్పాలని సూచించాడు. లేనిచో చంపుతానని హెచ్చరించాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతోనే తన కొడుకు షాహెద్‌ను పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్య చేశారని మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిద్దిపేట సీపీ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీరును, గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను అప్రమత్తం చేశారు.
పథకం ప్రకారమే హత్య చేశారని తల్లి ఫిర్యాదు


