తగ్గనున్న బీసీ సా్థనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సర్పంచులు, వార్డుమెంబర్ల పదవులకు తాజా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50%లోపు రిజర్వేషన్లు ఉండేలా మార్చిన శాతానికి తగ్గట్టుగా ఆయా పదవుల రిజర్వేషన్లపై జిల్లా అధికార యంత్రాంగం శనివారం కసరత్తును పూర్తి చేసింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీశాఖతోపాటు, జిల్లా పరిషత్ అధికారు లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు ఈ తాజా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆదివారం ఆయా రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం లాటరీ ద్వారా నిర్వహించనున్నారు. అనంతరం ఆయా సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ల వివరాలకు సంబంధించిన గెజిట్‌ను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు ఈ కసరత్తు జరిగింది.
బీసీలకు తగ్గిన స్థానాలు..
జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు 5,370 వార్డులున్నాయి. పాత రిజర్వేషన్ల ప్రకారం చూస్తే 613 గ్రామపంచాయతీల్లో 126 గ్రామాల సర్పంచ్ స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. 99 సర్పంచ్ స్థానాలు ఎస్టీలకే కేటాయించారు. బీసీలకు 224 సర్పంచ్ స్థానాలను రిజర్వు చేశారు. మిగిలిన 164 జనరల్‌గా ప్రకటించారు. మారిన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ, బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాల సంఖ్య తగ్గనుంది. జనరల్ స్థానాల సంఖ్య పెరగనుంది. ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
పెరగనున్న జనరల్ స్థానాలు
సర్పంచులు, వార్డు సభ్యుల తాజారిజర్వేషన్లు ఖరారు
నేడు మహిళా రిజర్వేషన్ల కోసం లాటరీ
రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన..
సర్పంచ్ స్థానాలను రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన ఖరారు చేశారు. వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లు మండలం ప్రాతిపదికన ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకోగా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీఓలోని మార్గదర్శకాల మేరకు ఖరారు చేశారు.


