పెండింగ్‌లో డీసీసీ పదవి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామకాన్ని అధిష్టానం పెండింగ్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీసీసీలను ప్రకటించిన అధినాయకత్వం ఒక్క సంగారెడ్డితోపాటు, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులను ప్రకటించలేదు. అయితే జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీసీసీ పదవి విషయంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్‌రెడ్డి పేరు వినిపించింది. అలాగే ఖేడ్ ఎమ్మెల్యే సోదరుడు పి.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఈ డీసీసీ పదవుల నియామకం కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిష్టానం ఈసారి నేతల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. ఏఐసీసీ నుంచి ప్రత్యేక పరిశీలకులు సిజరిటతోపాటు, మరో ఇద్దరు పీసీసీ పరిశీలకులతో గత నెలలో అభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగింది. ఈ పదవికి మొత్తం 42 మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఉన్న నీలం మధుముదిరాజ్, ఎంపీ సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ వంటి నాయకులు కూడా దరఖాస్తులు చేసుకున్నవారిలో ఉన్నారు.
ఎవరికివారుగా ప్రయత్నాలు
ఈ డీసీసీ పదవిని ఆశించిన నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకున్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉజ్వల్‌రెడ్డికి మద్దతు తెలిపారు. సంగారెడ్డితోపాటు, ఆందోల్ నియోజకవర్గం పార్టీ శ్రేణులంతా ఉజ్వల్‌రెడ్డికి డీసీసీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఉజ్వల్‌రెడ్డితోపాటు ఏఐసీసీ అగ్రనేత ఖర్గేను కూడా కలవడం చర్చనీయాంశమైంది. మరోవైపు చంద్రశేఖర్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డి ఆ యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలిసి ప్రయత్నాలు చేసుకున్నారు. ఇలా ఎవరికి వారే డీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ఉజ్వల్‌రెడ్డి నియామకాన్ని జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ వ్యతిరేకించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే చంద్రశేఖర్‌రెడ్డికి డీసీసీ పదవి విషయంలో ఎంపీ సురేశ్ షెట్కార్ అభ్యంతరం తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇలా జిల్లాలోని అగ్రనాయకుల మధ్య సమన్వయ లోపం ఉండటంతో అదిష్టానం ఈ పదవిని పెండింగ్‌లో పెట్టినట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
జిల్లా అగ్రనేతల మధ్య సమన్వయలోపమే కారణమా!


