సస్పెన్షన్లు కంటితుడిపేనా! | - | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్లు కంటితుడిపేనా!

Jul 19 2025 1:15 PM | Updated on Jul 19 2025 1:15 PM

సస్పెన్షన్లు కంటితుడిపేనా!

సస్పెన్షన్లు కంటితుడిపేనా!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడుల కేసు దర్యాప్తు నీరుగారిపోతోందా..? బదిలీపై వెళుతున్న ఇద్దరు ఎస్‌ఆర్‌ఓలు రాత్రికి రాత్రి 200 మించి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారానికి సంబంధించిన ఈ కేసు అటకెక్కుతోందా..? ఈ దాడుల అనంతరం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సదాశివపేట ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంపై గురువారం ఏసీబీ దాడులు నిర్వహించిన మాదిరిగానే..కొన్ని నెలల క్రితం సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారుల బృందాలు దాడులు చేశాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు 48 గంటల నిర్విరామంగా ఈ సోదాలు చేశాయి. అధికారులు సోదాలు చేస్తున్న క్రమంలో నోట్ల కట్టలకు ఈ కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరివేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బదిలీపై వెళుతున్న సబ్‌రిజిస్ట్రార్‌లు చివరి రోజు ఏకంగా 200లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఇందులో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని ప్రాథమికంగా తేల్చారు. పదుల సంఖ్యలో ఈ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను సీజ్‌ చేసి తీసుకెళ్లారు. ఆ ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌లను సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ అప్పటి కమిషనర్‌ జ్యొతిబుద్దప్రకాశ్‌ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ కేసు దర్యాప్తు తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తిరిగి పోస్టింగ్‌లు..

ఈ కేసులో వేటు పడిన ఓ ఎస్‌ఆర్‌ఓకు కొన్ని నెలల్లోనే తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఈ కేసు ప్రభావం ఏ మేరకు ఉందనేది ఇట్టే అర్థం చేసుకోచ్చు. పైగా ఈ ఎస్‌ఆర్‌ఓకు కాసులు కురిపించే స్థానంలో పోస్టింగ్‌ ఇచ్చినట్లు ఆ శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. సస్పెన్షన్‌కు గురైన మరో ఎస్‌ఆర్‌ఓకు కూడా కొన్ని రోజుల్లోనే పోస్టింగ్‌ ఇచ్చేందుకు పావులు కుదులుతున్న ఆశాఖ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేసి..ఏసీబీ కేసులు నమోదై..సస్పెన్షన్‌కు గురైన అధికారులకు కొన్ని నెలల్లోనే తిరిగి పోస్టింగ్‌లు దక్కుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు ఈ సోదాలు చేసిన సందర్భంగా ఏసీబీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను తిరిగి రిజిస్ట్రేషన్లశాఖకు అప్పగించినట్లు తెలుస్తోంది.

మారుతున్న ఐఓలు..

హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు అప్పుడు ఈ దాడులు నిర్వహించాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు కూడా హైదరాబాద్‌ అధికారులే చేస్తున్నారు. కొన్నినెలల్లోనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ముగ్గురు మారినట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన అధికారి ఈ కేసుపై అవగాహన తెచ్చుకోవడనికే సమయం పడుతోంది. ఈ కేసు దర్యాప్తు ఆశించినట్లుగా ముందుకు సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నీరుగారుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు!

సస్పెన్షన్‌ వేటు పడినా

ఎస్‌ఆర్‌ఓలకు తిరిగి పోస్టింగ్‌లు

తరచూ మారుతున్న

దర్యాప్తు అధికారులు..?

సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌

కార్యాలయం ఏసీబీ దాడుల కేసు తీరు

అనుకూలంగా నివేదికలు

మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సహకరించడం లేదని తెలుస్తోంది. సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఆర్‌ఓలను కాపాడేలా ఈ శాఖలోని ఉన్నతాధికారులు అనుకూలమైన నివేదికలు ఇచ్చినట్లు ఆశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా గురువారం ఇదే ఏసీబీ అధికారులు సదాశివపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు తక్కువే అయినప్పటికీ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరులో పెద్ద ఎత్తున అవకతవకలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడుల అంశంపై తెరపైకి వస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కొన్ని అనుమతులు రావాల్సి ఉందని ఏసీబీ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement