
పోటెత్తిన భక్తులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సదాశివపేట పట్టణంలో ఆషాఢమాసంలో పది రోజుల పాటుగా నిర్వహించే దుర్గమ్మ మహాజాతర ఉత్సవాలు శుక్రవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన సదాశివపేట దుర్గమ్మ మహాజాతర ఉత్సవాలను తిలకించేందుకు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో చివరిగా నిర్వహించే పచ్చికుండ బోనం ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. వందల ఏళ్ల నాటి ఆనవాయితీ మేరకు పట్టణంలోని మాజీ కౌన్సిలర్ గడీల కృష్ణగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్‌గౌడ్ ఇళ్ల నుంచి గడీల ప్రసాద్‌గౌడ్ పచ్చికుండ బోనాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి దుర్గమ్మకు బోనం సమర్పించారు. మరోవైపు సదర్ లింగమయ్య,మరో పక్క పోత రాజులు రంగమెక్కి మేక,గొర్రె పిల్లలను గావ్ పట్టడంతో దుర్గమ్మ మహాజాతర ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.